
తెలంగాణ హైకోర్టు సీజేగా సతీష్ చంద్ర శర్మ సోమవారం ప్రమాణం చేశారు. గవర్నర్ తమిళసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్ సతీష్‌చంద్ర ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయనకు గవర్నర్, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ 1961 నవంబర్ 30న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జన్మించారు. ఆయన తండ్రి బి.ఎన్.శర్మ భోపాల్‌లోని భర్కతుల్లా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, తల్లి శాంతి శర్మ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేశారు. ప్రాథమిక విద్య జబల్‌పూర్‌లోని సెంట్రల్ స్కూల్‌లో పూర్తి చేశారు. 1981లో డాక్టర్ హరిసింగ్‌గౌర్ వర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా అందుకున్నారు. 1984, సెప్టెంబర్ 1న మధ్యప్రదేశ్ బార్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు.ఎల్‌ఎల్‌బీలో మూడు బంగారు పతకాలు అందుకున్నారు. 1993లో అడిషనల్ సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు సతీష్ చంద్ర. 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హోదా పొందారు.




