
టర్కీ, సిరియాల్లో కలిపి ఇప్పటి వరకు 3,800 మందికిపైగా మృతి చెందారు. బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.తుర్కియే, సిరియా దేశాల్లో సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 4372కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్క టర్కీలోనే దాదాపు 11 వేల మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న 2,470 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. టర్కీ, సిరియాలను ఆదుకునేందుకు భారత్ సహా 45 దేశాలు ముందుకొచ్చాయి. ఆపదలో చిక్కుకున్న టర్కీకి భారత దేశం తక్షణం ఆపన్న హస్తం అందజేసింది. సహాయక బృందాలను, సామాగ్రిని పంపిస్తామని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించిన కొద్ది గంటల్లోనే అవి భారత వైమానిక దళ విమానంలో బయల్దేరాయి. జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) ఎన్‌డీఆర్ఎఫ్ బృందంలో మహిళలు , అత్యంత నైపుణ్యంగల జాగిలాల స్క్వాడ్స్, ఔషధాలు, అడ్వాన్స్‌డ్ డ్రిల్లింగ్ ఎక్విప్‌మెంట్, సహాయక చర్యలకు అవసరమయ్యే ముఖ్యమైన పరికరాలు వీటిలో ఉన్నాయి. 1999లో టర్కీలోని డజ్సీలో 7.4 తీవ్రతతో తలెత్తిన భూకంపంతో 17000కు పైగా మృతి చెందగా..ఇస్తాంబుల్‌లోనే దాదాపు వేయి మంది మృతి చెందారు. 1939లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో టర్కీలో 33వేల మందికిపైగా మృతి చెందారు. టర్కీలో భూకంపం వల్ల మరణించినవారి కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు.

