
15-18 ఏళ్ల యువతీ యవకులకు వ్యాక్సిన్ వేయించే బాధ్యత కాలేజీ యాజమాన్యలదే అంటూ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. చిన్నారులకు వ్యాక్సినేషన్ లో పాటించాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. తదనుగుణంగా తెలంగాణలోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఫస్ట్ డోస్ 100 శాతం పూర్తి చేసిన పెద్ద రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్న మంత్రి.. కేంద్రం ప్రశంసించిందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 1,014 కేంద్రాల్లో పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన పిల్లలందరికీ కొవాగ్జిన్ వ్యాక్సిన్లు ఇస్తామని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పిల్లలకు టీకాలు ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. తల్లిదండ్రులంతా విధిగా తమ పిల్లలను వ్యాక్సిన్ కేంద్రాలకు తీసుకొచ్చి టీకాలు వేయించాలని ఆయన కోరారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.




