
సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభోత్సవం జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 8న సికింద్రాబాద్ స్టేషన్ లో పచ్చజెండా ఊపనున్న ప్రధాని మోదీ. తెలుగు రాష్ట్రాల మధ్య ఇది రెండో వందేభారత్ రైలు. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖ మధ్య ఒక వందేభారత్ రైలు పరుగులు తీస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్యన వందేభారత్ రైలు నడవనుంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. సాధారణ షెడ్యూల్ ప్రకారం సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ కేవలం నాలుగు స్టేషన్లలోనే ఆగుతుంది. సికింద్రాబాద్ లో బయల్దేరాక నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలోనే ఆగుతుందని తెలిపారు. ఎనిమిదిన్నర గంటల్లో రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చేరుకోనున్నట్లు సమాచారం. ప్రారంభోత్సవం రోజున నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, పిడుగురాళ్లు, తెనాలి, బాపట్ల, చీరాల, గూడూరు స్టేషన్లలో వందేభారత్ రైలు ఆగనుంది.




