
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక సంచలన ప్రకటన చేసింది. విదేశాల నుంచి తీసుకున్న అప్పులను ఇకపై తాము కట్టలేమని, వాటిని ఎగ్గొట్టేస్తామని ఆ దేశ ఆర్థిక శాఖ ప్రకటించింది.కొవిడ్‌తో లంక ఆర్థిక స్థితి కుప్పకూలింది. క్షీణించిన విదేశీ నిల్వలు కారణంగానే.. ఆర్థిక సంక్షోభంలోకి దేశం కూరుకుపోయింది. మహమ్మారిని ఎదుర్కొన్న వెంటనే మన దేశం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం మొదలైంది. దేశానికి విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెట్టే పర్యాటక రంగం లాక్‌డౌన్లతో దెబ్బతింది. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నదని తెలిసినప్పటికీ.. లాక్‌డౌన్ విధించాల్సి వచ్చింది. అందుకే మన విదేశీ నిల్వలు క్షీణించాయి. దేశ ప్రజలకు తలెత్తిన అష్టకష్టాల పట్ల చింతిస్తున్నామని, ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించేందుకు రాత్రింబవళ్లు పటుపడుతామని శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సా తెలిపారు.ప్రస్తుతం శ్రీలంకకు 5600 కోట్ల డాలర్ల విదేశీ రుణం ఉంది. అసలు, వడ్డీల చెల్లింపు కోసం ఏటా 600 కోట్ల డాలర్లు చెల్లించాలి. కానీ, ఆ దేశం వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్యం నిల్వలు 200 కోట్ల డాలర్లు మాత్రమే.




