
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటాలు, త్యాగాలను జాతికి వివరించడానికి ఆజాదీకా అమృత్ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్మించిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి ప్రసంగించారు. అల్లూరి జన్మించిన పుణ్యభూమికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని అందుకు ఆయనకు పాదాభివందనాలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. వందేమాతరం నినాదం, ‘మనదే రాజ్యం’ నినాదం ఒకే లాంటివని చెప్పారు. అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులతో వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు ఆదివాసుల శౌర్యానికి ప్రతీక. అల్లూరి తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. తన ప్రసంగంలో ఏపీలోని ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంత్, పొట్టి శ్రీరాములు, కందుకూరి వీరేశ లింగం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవలను కొనియాడారు. ఆదివాసీలున్న జిల్లాల అభివృద్ధికి లాభం చేకూరేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం మరింత పెరగాలని అన్నారు. మన ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా దృష్టి సారించాలని తెలిపారు.




