సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
admin August 24, 2021 0 COMMENTS
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలనూ సెప్టెంబరు 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో సుమారు ఏడాదిన్నరగా మూగబోయిన బడి గంటలు మళ్లీ మోగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.30వ తేది లోపు స్కూళ్లను పరిశుభ్రంగా తయారు చేస్తామని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్కూళ్ల పరిశుభ్రత బాధ్యత మున్సిపల్, పంచాయతీ శాఖలదేనని ఆయన తెలిపారు. స్కూళ్లు పరిశుభ్రంగా ఉంచని స్కూల్ ప్రిన్సిపల్, సర్పంచ్, పంచాయతీ అధికారులపై చర్యలు తప్పవని ఆయన అన్నారు. ప్రతి స్కూల్ లో ఏఎన్ఎం, స్టాఫ్ నర్సు ఉండేలా చూస్తామని ఆయన అన్నారు.పాఠశాలలను శానిటైజేషన్ చేయించాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ స్కూల్స్లో కూడా వసతులు మెరుగుపరుస్తామన్నారు. ప్రభుత్వం తరపు నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు చేసి ఇంటికి పంపే ఏర్పాట్లపై చర్చించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. జీ ఓ నెంబర్ 46 ప్రకారం ఫీజులు మాత్రమే వసూలు చేయాలని తెలిపారు.




