
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట వద్ద వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం సాయంత్రం వరదల్లో చిక్కుకున్న బస్సును జేసీబీ సహాయంతో తీయడానికి ప్రయత్నించారు. కామారెడ్డి నుంచి సిద్దిపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరద తాకిడికి వాగులో చిక్కుకుపోయింది. ఒక టైర్ కిందికి దిగి ఆగిపోయింది. బస్సులో 29 మంది ప్రయాణీకులు ఉండగా.. గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్ సీటు పక్కన ఉండే కిటికీలోంచి ప్రయాణికులను రక్షించారు.నర్మాల ఎగువ మానేరు మత్తడి దుంకడంతో లింగన్నపేట వద్ద మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో శివారులోని లోలెవల్ బ్రిడ్జి మీదుగా వరద వెళ్తోంది. అయితే డ్రైవర్ గమనించకుండా బస్సును లోలెవల్ బ్రిడ్జి మీదుగా తీసుకెళ్లగా, నీటి ప్రవాహానికి బస్సు అదుపు తప్పింది.




