Wednesday, 25 November 2026
న్యూస్ · April 22, 2022 · admin

గోదావ‌రి బోర్డు స‌మావేశం రెండు సార్లు వాయిదా

 గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) సమావేశం మరోసారి వాయిదాపడింది. ఏపీ సభ్యుల ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి రాలేదని, దీంతో భేటీ వాయిదా పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ అన్నారు. హైద‌రాబాద్‌లోని జ‌ల‌సౌధ‌లో శుక్ర‌వారం మొదలైన ఈ స‌మావేశానికి తెలంగాణ ప్ర‌తినిధి బృందం హాజ‌రైనా… ఏపీ ప్ర‌తినిధుల కోసం కాసేపు వేచి చూసిన బోర్డు, వారి జాడ లేక‌పోవ‌డంతో స‌మావేశాన్ని వాయిదా వేసింది. ఏపీ సభ్యుల గైర్హాజరుతో మార్చి 11న కూడా భేటీ వాయిదా పడింది. ఈ స‌మావేశానికి సంబంధించి ఏపీ ప్ర‌భుత్వానికి బోర్డునుంచి ముందుగానే స‌మాచారం వెళ్లింది. వరుసగా రెండు సార్లు సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ వారు హాజరుకాలేదు.