
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర ఫిబ్రవరి రెండో వారంలో జరగనుంది.సమ్మక్క- సారలమ్మ మహా జాతర -2022 ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఈ మహా జాతర జరగనుంది. రెండేళ్లకు ఒక్కసారి వచ్చే ఈ మహా జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం అమ్మవార్లను దర్శించకునేందుకు భారీగా వస్తారు. జాతర దృష్ట్యా ఇప్పటి నుంచే భక్తుల రాక పోకలు పెరిగాయి. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తోంది. ప్రజల సౌకర్యార్ధం హైదరాబాద్ MBGS నుండి మేడారానికి స్పెషల్ బస్సులు పెట్టడం జరిగిందని ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మహా జాతరకు ప్రభుత్వం రూ.75 కోట్లను విడుదల చేసింది.కోవిడ్ మొదలైన తర్వాత మొదటిసారి జాతర జరుగుతుండటంతో ఈసారి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది.




